ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : వల్లూరు క్రాంతి

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి :  వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్​ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లతో  కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలన్నారు. 

ప్రజావాణిలో మొత్తం 34  దరఖాస్తులు రాగా అందులో 15 రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించి 19 ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్​లో సీఎం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓనగేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట టౌన్: సిద్దిపేట కలెక్టర్​ఆఫీసులో అడిషనల్​ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమం అని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా అధికారులు పనిచేయాలని సూచించారు. భూ సంబంధిత, ఆసరా పింఛన్లు ఇతరత్రా మొత్తం కలిపి 16 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.