
- కడెం ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
కడెం, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్గా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కడెం ప్రాజెక్టును ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి సందర్శించారు. కొద్దిరోజుల పాటు అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన పేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్ట్ మట్టాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు గేట్లను ఎత్తి నీటిని వదలాలని సూచించారు.
అన్ని గేట్లు ఎత్తాల్సిసిన పరిస్థితి ఏర్పడితే.. ప్రాజెక్టు దిగువనన్న అన్ని గ్రామాలను అలర్ట్ చేయాలన్నారు. గ్రామాల్లో టామ్ టామ్ చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల న్నారు. గేట్లను ఎత్తే ముందు ప్రజలకు తెలిసేలా సైరన్ మోగించాలన్నారు. ప్రాజెక్టు సమీపంలోకి ప్రజలు, చేపలు పట్టే వారిని, రైతులు, పశుకాపరులు, సందర్శకులను అనుమతించవద్దన్నారు.
ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టు పవర్ హౌస్లో ఏర్పాటు చేసిన స్క్రీన్లో కెమెరాల ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఏఎస్పీ రాజేశ్ మీనా, అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ ప్రభాకర్, డీఎఫ్వో నాగిని భాను, ఎస్ఈ వెంకట రాజేంద్రప్రసాద్, ఈఈ విఠల్, డీఈఈలు నవీన్, వీరన్న, కె.గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుకు భారీగా వరద
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం 2 గేట్లు ఎత్తారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టులోకి 3,523 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి 9,657 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (4.699 టీఎంసీలు) కాగ ప్రస్తుతం 694.900 అడుగులు (3.488 టీఎంసీ) మేర నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు.