
నిర్మల్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ కు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు విభాగాలను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటైన పిల్లల వైద్య విభాగాన్ని పరిశీలించి చిన్నారులకు అన్ని రకాల సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఔట్ పేషెంట్ వార్డుల్లో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సీజనల్వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైనన్ని మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.
వరదలు వస్తే ప్రజలను అప్రమత్తం చేయాలి
జిల్లాలో వర్షాలు, అకాల వరదలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్డీఆర్ఎఫ్టీమ్కు సూచించారు. చించోలి.బి లోని ప్రభుత్వ మైనారిటీ స్కూల్లో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వరదలు వస్తే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. స్కూల్ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్కిశోర్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.