
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని, వడ్డించే ముందు సూపర్వైజర్లు తప్పకుండా రుచి చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం మర్రికుంట కేజీబీవీని అకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని వంట గదిని పరిశీలించారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసే సామగ్రి, బియ్యం నాణ్యతగా ఉంటేనే తీసుకోవాలని, లేకుంటే స్టాక్ రిటర్న్ పంపించాలని సూచించారు.
ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడుతూ.. ఏ సబ్జెక్ట్ అయినా అర్థవంతంగా నేర్చుకోవాలని, బట్టీ పద్ధతి మంచిది కాదని చెప్పారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని హరిజనవాడ జడ్పీహెచ్ఎస్ ను తనిఖీ చేసి, టీచర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని జీహెచ్ఎం చంద్రశేఖర్ కు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. జీసీడీవో శుభలక్ష్మి, హౌసింగ్ డీఈ విఠోబా, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.