కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా , ప్రశాంతంగా నిర్వహించటంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించి, ఎలాంటి లోపాలు కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలన్నారు.
ఎన్నికల అబ్జర్వర్ సత్యానారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధానాలు, పోలింగ్ పక్రియ, ఎలక్టోరల్ రూల్స్ వివరించారు. మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, డీపీవో మురళి, డీఎల్పీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ మండల కేంద్రంలో...
ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రిసైడింగ్, అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారుల శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి అధికారి బాధ్యతగా, నిబద్దతతో పని చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వాలన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు దోమకొండ ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. జడ్పీ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, డీఎల్పీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మహిళలకు సర్టిపికెట్లు అందజేత
వివిధ కార్యక్రమాల నిర్వహణకు గాను శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం సర్టిఫికెట్లను అందించారు. వివిధ అంశాలపై సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మహిళలకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారన్నారు. డీఆర్డీవో సురేందర్, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, ఏపీఎం రాజేందర్ తదితరలు పాల్గొన్నారు.

