- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
లింగంపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను త్వరగా లారీల్లో లోడ్ చేసి మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గురువారం మండలంలోని ఎల్లారం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి హమాలీలను పలకరించారు. ఎక్కడి నుంచి వచ్చారని అడగగా బీహార్ నుంచి వచ్చామని సమాధానమిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారా? రైతుల ఖాతాల్లో డబ్బులు సమయానికి జమవుతున్నాయా? అంటూ అధికారులను ప్రశ్నించారు.
ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి..
ఎల్లారంలో నల్లవెల్లి లక్ష్మీ నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇసుక, ఇటుకలు, సిమెంట్, స్టీల్ వంటి అవసరమైన సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్డీవో సురేందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, హౌసింగ్ డీఈఈ సుభాష్, ఎంపీడీవో నరేశ్, తహసీల్దార్ సురేశ్, హౌసింగ్ ఏఈ సృజన్‌కుమార్, ఏవో అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామన్ సర్వీస్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి : రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, కామన్ సర్వీస్ సెంటర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ నేషనల్ కోఆపరేటీవ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షేర్ క్యాపిటల్, మేనేజ్‌మెంట్ ఖర్చుల నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని, ఎఫ్‌పీవో సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఎం డైరెక్టర్ గణేశన్, ఎన్‌సీడీసీ రీజినల్ డైరెక్టర్ సర్థూల్, డీసీవో రాంమోహన్, సింగిల్‌విండో చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
