నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశానికి తలమానికంగా నిలుస్తోందని, టైగర్ రిజర్వ్ పరిధిలోని తరలింపు గ్రామాల పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కొల్లంపెంట, సర్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండల పెంట గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల తరలింపు ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎన్‌టీసీఏ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరగాలన్నారు. గ్రామాల పునరావాసం నిమిత్తం అచ్చంపేట డివిజన్, లింగాల్ మండలంలోని బాచారం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1501.88 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇన్-ప్రిన్సిపల్ (స్టేజ్–II) అనుమతి లభించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ పి.అమరేందర్, జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, ఎన్జీవో ఇమ్రాన్ సిద్ధికి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బాలికలు జాగ్రత్తలు తీసుకోవాలి..
బాలికలు విద్య, ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. తాడూరు కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థినులకు అమెరికన్ తెలుగు అసోసియేషన్, మానవతా ఫౌండేషన్ సంయుక్తంగా పర్యావరణ హిత శానిటరీ కప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సహజమని, ఆ మార్పులను గురించి ప్రతి అమ్మాయి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
