నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అధికారుల సమన్వయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయడంలో అధికారుల కృషి మరువలేనిదన్నారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేయడం వల్ల ఎన్నికలు సజావుగా నిర్వహించామని తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారని చెప్పారు. జిల్లా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ప్రతి నోడల్ అధికారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ ను అధికారులు శాలువాతో సత్కరించారు. సభలో అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
