
ములుగు, వెలుగు: ప్రతీ గ్రామంలో పోషణ అవగాహన ర్యాలీలు, వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. మంగళవారం 8వ రాష్ట్రీయ పోషణ్ నెల రోజుల కార్యక్రమాలపై జిల్లాలోని సీడీపీవోలు, పోషణ్ అభియాన్ సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
గర్భిణులకు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలని, స్థానిక విద్యార్థులు, మహిళా సంఘాలు, సర్వే సభ్యుల ద్వారా ప్రజల్లో పోషణపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పోషకాహారానికి సంబంధించి అవగాహన పెంచాలన్నారు. నెలరోజులపాటు పోషణ గురువులు, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి తల్లి సమావేశాలు, వంటల పోటీలు, పోషకాహార ప్రదర్శనలు, పాలు, పండ్లు పంపిణీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్వో గోపాల్ రావు, జిల్లా సంక్షేమ అధికారి తుల రవి పాల్గొన్నారు.