
ములుగు/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు : దేశ దశదిశను మార్చేది విద్యనే అని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ములుగు జిల్లాలో ఉత్తమ పీఎంశ్రీ స్కూల్ గా ఎంపిక కాగా, మంగళవారం కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ స్కూల్ ను సందర్శించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎంశ్రీ పథకంలో ములుగు మండలం బండారుపల్లి మోడల్ స్కూల్ ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పాఠశాలకు మంజూరైన సంగీత పరికరాలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సింగారం దేవకి, ఎంఈవో వి.తిరుపతి, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ అర్షం రాజు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. అనంతరం వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్, పీహెచ్సీ, పాలంపేట జడ్పీహెచ్ఎస్, రామప్ప రిజర్వాయర్, తూమును కలెక్టర్తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.