యూనివర్సిటీ స్థలం చుట్టూ కనీలు పాతండి : కలెక్టర్ దివాకర

యూనివర్సిటీ స్థలం చుట్టూ కనీలు పాతండి : కలెక్టర్ దివాకర

ములుగు, వెలుగు: ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద నిర్మించనున్న జాతీయ గిరిజన విశ్వవిద్యాలయ స్థలం చుట్టూ కనీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. యూనివర్సిటీ కోసం మొత్తం 337ఎకరాల స్థలాన్ని సేకరించామని, స్థలాన్ని రెవెన్యూ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు బదలాయింపు చేశారని తెలిపారు. ఈ ఏడాది యూనివర్సిటీ ఏర్పాటులో భాగంగా తాత్కాలిక తరగతుల నిర్వహణకు జాకారంలోని ట్రైబల్ శాఖకు చెందిన యూత్ ట్రైనింగ్ సెంటర్ లో (వైటీసీ) తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కలెక్టర్​వెంట అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్, ఆర్ఐ తదితరులున్నారు.

రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయాలి..  

ప్రపంచ వారసత్వ సంపద, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో పురావస్తుశాఖ అధికారులతో కలెక్టర్​ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప ఆలయం వద్ద ప్రసాద్ స్కీంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పనులను వేగవంతం చేయాలన్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు, భక్తులకు మౌలిక సదుపాయాలు  కల్పించాలన్నారు.

రామప్ప ఆలయ పరిసరాల్లోని శివాలయం, గొల్లగుడి దేవాలయాలు రామప్ప దేవాలయం ఒకే ప్రాంగణంలో ఉండాలని వాటికి సంబంధించిన స్థల సర్వేలు నిర్వహించాలని పురావస్తుశాఖ అధికారులు కలెక్టర్ ను కోరారు. సమావేశం లో కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ రోహిణి పాండే అంబేద్కర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.