- సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్, వెలుగు : కోటి ప్లాంటేషన్ లో భాగంగా ఈ నెల 26న జిల్లాలో మెగా ప్లాంటేషన్ కు ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురితో కలిసి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పట్టణం, పంచాయతీలో ప్లాంటేషన్ జరగాలన్నారు. ఆసరా స్పౌస్ పింఛన్లు, పెంచిన వికలాంగుల పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు.
రెండో విడతలో బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం స్పీడప్ చేయాలని చెప్పారు. రెండు రోజుల్లోపు హౌస్ సైట్స్ పట్టాల పంపిణీ పూర్తి కావాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీవో సురేశ్మోహన్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, మైనార్టీ సంక్షేమ అధికారి దేవుజా, డీఆర్ఓ నగేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, డీఆర్డీఏ ఏపీడీ సూర్యారావు, హౌసింగ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా
ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సెప్టెంబర్,19 లోగా తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 21న జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని, ఐదు నియోజకవర్గాలలో మొత్తం 12,40,016 జనరల్ ఓటర్లు, 357 సర్వీస్ ఓటర్లు, 64 ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను విచారించి సెప్టెంబర్ 28లోగా పరిష్కరిస్తారని చెప్పారు. అక్టోబర్ 4న తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.