
- డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో లేకుంటే కఠిన చర్యలు
- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: డాక్టర్లు డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా ఉంటే సహించమని కలెక్టర్హైమావతి హెచ్చరించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని మెడిసిన్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గురువారం నంగునూరు మండల కేంద్రం, అక్కెనపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.
అటెండెన్స్, ఓపీ, అడ్మిషన్ రిజిస్టర్లు వెరిఫై చేసి అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని అధికారులను ఆదేశించారు. డ్యూటీ డాక్టర్ రిజిస్టర్ లో సంతకం చేసి ఆస్పత్రిలో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయుష్ రూమ్ కు తాళం వేయడంపై ఆగ్రహించి ఆయుష్ డాక్టర్ రెగ్యులర్ గా రావాలని రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
అక్కన్నపల్లిలో చెరువు నిండి ఇళ్లలోకి నీరు చేరుతున్న ప్రాంతాలను, చెరువు నుంచి నీరు వచ్చే కాల్వను పరిశీలించి బఫర్ జోన్ సర్వే చేయించాలన్నారు. ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్సరిత, ఎంపీడీవో లక్ష్మణ్ ఉన్నారు. అనంతరం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించి చేనేత రుణమాఫీలో భాగంగా జిల్లాలో ఏడుగురు చేనేత కార్మికులు ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా చేనేత జౌళి అధికారి సాగర్, జిల్లా పరిశ్రమల అధికారి గణేశ్ రామ్, హరిబాబు, నాబార్డు డీడీఎం నిఖిల్, డీసీసీబీ బ్యాంక్ ఎండీ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.