
జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం జగదేవపూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. జగదేవపూర్ గ్రామానికి 42 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని 17 ఇండ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని, మరో 11 మంది కట్టుకోని వారు ఉన్నారని మండల అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు ఇండ్లు మొదలు పెట్టాలన్నారు. ఇండ్లు మంజూరై కట్టుకోవడానికి సిద్ధంగా లేనివారి నుంచి లెటర్ రాయించుకొని మిగతా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
ఇద్దరు హెచ్ఎంలకు మెమోలు జారీ
మండలంలోని తీగుల్ లో జడ్పీ హై స్కూల్, ప్రైమరీ స్కూల్, బీసీ, ఎస్సీ హాస్టల్స్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్, ప్రైమరీ స్కూల్స్ లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో స్కూల్లోని వంట మనుషులు, ఇద్దరు హెచ్ఎంలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమోలు జారీ చేశారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌కు రోగులు తమపట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
దీంతో కలెక్టర్పీహెచ్సీ డాక్టర్లను మందలించారు. ఆస్పత్రి పరిసరాలను పరి శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఆస్పత్రి చుట్టూ ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్నిర్మల, ఎంపీడీవో రాంరెడ్డి, ఏఎస్ఐ రమణారెడ్డి, ఎంపీవో కాజా మొయినుద్దీన్ ఉన్నారు.
ఇచ్చిన లక్షాన్ని పూర్తి చేయాలి
సిద్దిపేట రూరల్: జిల్లాకు ఇచ్చిన 6500 ఎకరాల ఆయిల్ పామ్ లక్షాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు రైతుల ఇంటికి వెళ్లి ఆయిల్ పామ్వల్ల కలిగే లాభాల గురించి వివరించాలన్నారు.
ప్రతిరోజూ 9 గంటలకు ఆయిల్ పామ్టార్గెట్ పై వ్యవసాయ, ఉద్యాన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. కోహెడ మండలంలో ఆయిల్పామ్మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఏవో రాధిక, జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.