
- మెదక్, సంగారెడ్డి జిల్లాలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్‌రాజ్, డీఆర్వో పద్మజారాణి
సిద్దిపేట టౌన్, వెలుగు : ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిశీలించి శనివారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి 157 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 11న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లు కలిగిన పిల్లలు 2,29,361 మంది ఉన్నారని, వారికి 2461 కేంద్రాల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో ధనరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ ఆనంద్, డిప్యూటి డీఎంహెచ్ వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కామన్ డైట్, సివిల్ పనుల పురోగతి పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుకింగ్ లో సిబ్బంది కొరత ఉన్న దగ్గర అదనపు సిబ్బంది సాయం తీసుకోవాలని సూచించారు. ఎక్కడ కూడా ఫుడ్ సర్వ్ చేయడంలో పిల్లలను వినియోగించకూడదన్నారు. ఎంఈఓలు ప్రతి వారం స్కూళ్లలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించే ఆహారాన్ని తనిఖీ చేసి నివేదికను అందించాలని ఆదేశించారు.
జిల్లాలోని 23 కేజీబీవీల్లో రిపేర్ పనుల కోసం రూ.8 కోట్ల 72 లక్షలు, 8 రెసిడెన్షియల్ స్కూళ్ల రిపేర్ కోసం రూ. 6 కోట్ల 6 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. వాటి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ లను అందించారు. జిల్లాలో వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు చేసుకున్న కంపెనీల అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ- పాస్ లో పెండింగ్ అప్లికేషన్ లను పరిష్కరించి క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణికి 111 అర్జీలు
మెదక్, చేగుంట: ప్రజావాణి దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. మెదక్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై మొత్తం 111 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 32, పింఛన్లు 10, ఇందిరమ్మ ఇండ్లు 12, ఇతర సమస్యలపై 57 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం చేగుంట మండలం కసాన్ పల్లిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ స్కూల్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శవంతంగా తయారవుతున్నాయన్నారు. గర్భిణీలకు,చిన్నపిల్లలకు మెనూ ప్రకారంపోషకాహారం అందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వేగంగా ఇండ్లు నిర్మించుకోవాలన్నారు.
దశలవారీగా బిల్లులు అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల శుభ్రతపై పంచాయతీ సెక్రటరీ, ఆశ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శించి నిరంతరం విద్యుత్ అందించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజావాణి కి 57 ఫిర్యాదులు
సంగారెడ్డి టౌన్: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టొద్దని డీఆర్వో పద్మజా రాణి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణికి 57 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి త్వరతగతిన పరిష్కారించాలని సూచించారు.
అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ అధికారి లలితా కుమారి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి , పీడీ డీఆర్డీవో జ్యోతి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నాగనిర్మల, సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తల్లి పాలు తాగడం వల్ల శిశువుల ఎదుగుదల బాగుంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
అనంతరం పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్షలో రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, విద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుళ్లిన కూరగాయలతో వంట చేయమంటున్నరు..
ఝరాసంగం: మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలికల స్కూల్లో ప్రిన్సిపాల్కుళ్లిన కూరగాయలతో వంట చేయాలని ఆదేశిస్తున్నాడని వంటమనిషి వెంకటేశం సోమవారం తహీసీల్దార్ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కుళ్లిన కూరగాయలు, ఆకు కూరలతో వంట చేస్తే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. స్పందించిన తహసీల్దార్ తిరుమల్‌రావు, డీటీ, ఆర్ఐ గురుకులాన్ని సందర్శించి హాస్టల్వంట గదిని పరిశీలించారు.
అందులో ఒక్క ప్యాన్ లేదని వంట సామగ్రి చిందర వందరగా పడి ఉందని, నల్లా పైపులు పనిచేయకపోవడాన్ని గమనించారు. తక్షణమే వీటన్నిటిని సరిచేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.