భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

యాదాద్రి, సూర్యాపేట కలెక్టరేట్, నల్గొండ అర్బన్, వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు సూచించారు. సోమవారం యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ కలెక్టరేట్లలో వేర్వేరుగా నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఆఫీసర్లను ఉద్దేశించి యాదాద్రి కలెక్టర్ మాట్లాడారు. వర్షాల కారణంగా చెరువుల్లో నీరు చేరి అలుగు పోస్తున్నాయని, వాగుల్లో వరద నీరు చేరి రోడ్లపైకి వస్తోందన్నారు. వాగుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాటిని దాటవద్దని ప్రజలకు సూచించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా హెల్త్​ డిపార్ట్​మెంట్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 36 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. 

ముందస్తు చర్యలు చేపట్టాలి..

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇండ్లను గుర్తించి ప్రజలను ఖాళీ చేయించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సమస్యలను సకాలంలో పరిష్కరించాలి..

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారని తెలిపారు. 

కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా నుంచి మొత్తం 69 దరఖాస్తులు  రాగా, వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అడిషనల్​కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.