
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్స్ కు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెంచడానికి టీచర్లు మరింత కృషి చేయాలన్నారు.
ప్రజలకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలిగేలా విద్యాబోధన ఉండాలని చెప్పారు. గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ను మాజీ సర్పంచ్ కవిత, స్కూల్ స్టాఫ్ శాలువాతో సన్మానించారు. అంతకుముందు యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో డీఈవో సత్యనారాయణ, వంగపల్లి మాజీ సర్పంచ్ కవితగౌడ్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఎంఈవో శరత్ యామినీ, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.