ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణపేట, వెలుగు: పుట్టిన బిడ్డకు ఆరేళ్లు వచ్చే వరకు పౌష్టికాహారం అందిస్తేనే మంచి జీవితం ఇచ్చినవాళ్లమవుతామని కలెక్టర్ హరిచందన చెప్పారు.  సోమవారం కలెక్టరేట్‌‌లో ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని శ్యామ్‌‌ మ్యామ్‌‌ పిల్లలపై స్త్రీశిశు సంక్షేమ శాఖ,  వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పౌష్టికాహారం అందిస్తేనే పెద్దయ్యాక ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు.  తల్లిదండ్రులతో పాటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఈ బాధ్యత తీసుకోవాలని సూచించారు. శ్యామ్‌‌ మ్యామ్‌‌ పిల్లలతో పాటు రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి శుక్రవారం నుంచి న్యూట్రీ చిక్కిలు, లడ్డూలు ఇవ్వాలని ఆదేశించారు.   అడిషనల్‌‌ కలెక్టర్  చంద్రా రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, డీఎంహెచ్‌‌వో  రామ్ మనోహర్ పాల్గొన్నారు.

హామీలు గాలికొదిలేసిన సీఎం కేసీఆర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి

పెద్దమందడి, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. మాయ మాటలతో పబ్బం గడుపుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.  సోమవారం పెద్ద మండలంలో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర’లో ఆయన పాల్గొన్నారు.  పాంరెడ్డి పల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటున్న సీఎం కేసీఆర్‌‌‌‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారన్నారు.  రుణమాఫీ,  ఉచిత ఎరువులు, పంట నష్ట పరిహారం,   డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విద్యుత్‌‌, రిజిస్ట్రేషన్‌‌, బస్‌‌ చార్జీలతో పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.  ధరణితో భూసమస్యలు ఎక్కువయ్యాయని, ఆసరా పింఛన్లు అర్హులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.    పంచాయతీలకు కేంద్రం నిధులిస్తే.. రాష్ట్ర సర్కారు ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవకి వాసుదేవరావు, అశ్వత్థామ రెడ్డి, బోస్ పల్లి ప్రతాప్, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, మాధవరెడ్డి, బి కృష్ణ, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, అనుజ్ఞ రెడ్డి,పెద్దిరాజు, నందకుమార్, చెన్నయ్య, రమేశ్ పాల్గొన్నారు.

జిల్లా ఆస్పత్రిలో మోకాలు మార్పిడి చికిత్స
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ , వెలుగు: కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్ర్త చికిత్సను జిల్లా ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఆస్పత్రిలో మోకాలు మార్పిడి శస్ర్త చికిత్సల యూనిట్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాల్లో మోకాలు మార్పిడి శస్ర్త చికిత్సకు సంబంధించిన సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోయారు.  ఇకనుంచి అలాంటి ఇబ్బందులు ఉండవని, పేషెంట్లు వినియోగించుకోవాలని సూచించారు. జనరల్ ఆస్పత్రిలో త్వరలోనే గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ కూడా అందుబాటులోకి రానుందన్నారు. రూ. 4 కోట్లతో క్యాథ్ ల్యాబ్ మంజూరు అయ్యిందని,  త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్సులు, నర్సులు, సిబ్బంది వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మూడా చైర్మన్ గంజి వెంకన్న, ఆస్పత్రి సలహా సంఘం మెంబర్స్ లక్ష్మి, మల్లేశ్, సత్యం యాదవ్, సూపరిండెంట్ డాక్టర్ రాంకిషన్, డిప్యూటీ సూపరిండెంట్ జీవన్, తులసీరాం, వినోద్  పాల్గొన్నారు. 

పర్మిషన్‌‌ లేని హాస్పిటల్స్‌‌ సీజ్
గద్వాల టౌన్, దేవరకద్ర, అచ్చంపేట, కల్వకుర్తి, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రైవేట్‌‌ ఆస్పత్రులపై సోమవారం మెడికల్ ఆఫీసర్లు దాడులు చేశారు. గద్వాలలో డీఎంహెచ్‌‌వో  చందు నాయక్ ఆధ్వర్యంలో ఆస్పత్రులు, ల్యాబ్‌‌లను తనిఖీ చేశారు. రూల్స్‌‌ పాటించని బాబా సాహెబ్ ఆస్పత్రి డాక్టర్‌‌‌‌కు షోకాజ్‌‌ నోటీసు ఇవ్వడంతో పాటు సెలైన్ బాటిల్స్ హెవీ కిట్లు దొరికిన విజయ్ కుమార్ ఆర్‌‌‌‌ఎంపీ  క్లినిక్ ను సీజ్ చేశారు. కాగా, తనిఖీ విషయం తెలుసుకున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్‌‌ నిర్వాహకులు ఉదయమే క్లోజ్‌‌ చేసి వెళ్లిపోయారు.  మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఏడు ఆస్పత్రులను తనిఖీ చేసిన ప్రోగ్రామ్‌‌ ఆఫీసర్‌‌‌‌ భాస్కర్‌‌‌‌ అమ్మ క్లినిక్​, బాలజీ నర్సింగ్​ హోమ్‌కు షోకాజ్ ​నోటీసులు ఇచ్చారు. పర్మిషన్‌‌ లేకుండా నిర్వహిస్తున్న  మీనాక్షి ఐ, స్కిన్‌‌ కేర్​ సెంటర్‌‌‌‌ను సీజ్ చేశారు. అచ్చంపేట పట్టణంలో తనిఖీలు 
చేసిన ఇమ్యునైజేషన్​ఆఫీసర్​రవి కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌‌వో సురేశ్​ పర్మిషన్‌ లేని ఏఎంఆర్​ హాస్పిటల్‌‌ను సీజ్​ చేశారు.  అల్లోపతి డాక్టర్ ​స్థానంలో హోమియోపతి డాక్టర్‌‌ను కొనసాగిస్తున్న శ్రీసాయి హాస్పిటల్‌‌, రూల్స్‌ పాటించని ఎంఎంఆర్‌‌‌‌ హాస్పిటల్‌‌కు నోటీసులు ఇచ్చారు. కల్వకుర్తి  పట్టణంలోని శ్రీ సాయి, ప్రణీత, శ్రీలక్ష్మి, కార్తీక్ డయాగ్నస్టిక్ సెంటర్,అక్షిత డెంటల్ కేర్ ఆస్పత్రులను తనిఖీ చేసిన ఆఫీసర్లు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు.

వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి 
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి 

ఊట్కూర్, వెలుగు: వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని,   ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయమని అడుగుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు 64 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక దీక్షకు సోమవారం మద్దతు తెలిపి మాట్లాడారు.   వీఆర్ఏలకు పే స్కేల్, 55 ఏళ్లు నిండిన వారి  వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వమే చెప్పిందన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.  మండల అధ్యక్షుడు రమేశ్, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ గోపాల్, మాజీ ఎంపీటీసీ వెంకట్రారాములు, నేతలు ఆశప్ప,  లక్ష్మణ్, అశోక్, సురేశ్ పాల్గొన్నారు. 

నేటి నుంచి పుడ్ పాయిజన్ నివారణపై శిక్షణ
 కలెక్టర్ షేక్ యాస్మిన్‌‌ బాషా

వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు గురుకులాల స్టాప్ కు పుడ్ పాయిజన్ నివారణపై శిక్షణ ఇవ్వనున్నట్లు  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మంగళవారం కుకింగ్ స్టాప్ కు, బుధవారం డిప్యూటీ వార్డెన్లు, గురువారం స్టాప్ నర్స్ , శుక్రవారం ప్రిన్సిపాల్స్ కు  ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందన్నారు.  మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రోగ్రామ్‌‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్స్‌‌తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌‌ స్టాప్‌‌ కూడా హాజరు కావాలని కోరారు.   

అధికారుల సహకారంతోనే  రేషన్ దందా
మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తిలో  అధికారుల సహకారంతోనే రేషన్‌‌ బియ్యం దందా కొనసాగుతోందని మాజీ మంత్రి చిత్తరంజన్‌‌ ఆరోపించారు. సోమవారం కల్వకుర్తి తాలూకా అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో  ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.  పేదలకు ఇచ్చే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లర్లకు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్‌‌‌‌ సహకరిస్తున్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని  డిమాండ్ చేశారు.  ఇటీవల శ్రీనిధి రైస్ మిల్లులో  1,221 క్వింటాళ్ల  రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేసినట్లు కల్వకుర్తి లారీ అసోసియేషన్ సభ్యులు అధికారులకు సమాచారం ఇస్తే.. తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.  అంతేకాదు సమాచారం ఇచ్చిన లారీ అసోసియేషన్ సభ్యులను మిల్లులోనే ఉంచి గేట్‌‌కు తాళం వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, అయినా వినకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు గౌడ్, ప్రభాకర్ రెడ్డి, పెద్దయ్య యాదవ్, సదానందం,శేఖర్, శశి కుమార్, లక్ష్మయ్య  పాల్గొన్నారు.

నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట, వెలుగు: ఏదుల రిజార్వాయర్ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని,  ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.  సోమవారం గోపాల్ పేట మండలం ఏదులలో రూ. 30 లక్షలతో నిర్మించిన కొత్త జీపీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు రేవల్లి మండలకేంద్రంలో సర్వవర్గ సామూహిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బండరావిపాకుల ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ భవనాలు ప్రారంభించారు. తర్వాత  కొంకలపల్లి ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను  పరిశీలించి నిర్వాసితులకు ప్లాట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్వాసితులు కోరిన విధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం,  అర్హులందరికీ ప్లాట్లు ఇచ్చామన్నారు.  ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో  స్కూల్‌‌, పశు వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రం, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.  నిర్వాసితులు  మత్స్య సహకార సంఘం ఏర్పాటుకు సహకార శాఖలో  పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, సీఈ హమీద్ ఖాన్, జేసీ వేణుగోపాల్, డీఈ సత్యనారాయణ గౌడ్, గోపాల్ పేట, ఎంపీపీ సంద్య యాదవ్, జడ్పీటీసీ భార్గవి, రెవల్లి ఎంపీపీ సేనాపతి తదితరులు  పాల్గొన్నారు. 

పాలు పెరుగు ఉయ్యాలో..  పాలమూరు ఉయ్యాలో..  
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బతుకమ్మ సంబురాలు సందడిగా కొనసాగుతున్నాయి.  మహిళలు, యువతులు రెండోరోజైన సోమవారం ‘అటుకుల’ బతుకమ్మను పేర్చి.. గౌరమ్మను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం ఉయ్యాల పాటలు పాడుతూ.. ఆటలు ఆడారు.  వనపర్తిలో కలెక్టర్‌‌‌‌ యాస్మిన్ బాషా,   పీయూలో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజా మంగతాయారు, ప్రిన్సిపాల్ కిశోర్,  జడ్పీ మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో అడిషనల్ కలెక్టర్ కె.సీతారామారావు పాల్గొన్నారు.   – వెలుగు స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్

ఇల్లు లేదు.. పింఛన్ వస్తలేదు
గద్వాల, వెలుగు: ‘మేము ఇద్దరం అక్కాచెల్లెళ్లం.. తల్లిండ్రులు లేరు.. ఇల్లు లేదు.. పింఛన్‌‌ వస్తలేదు.. కిరాయి ఇంటోళ్లు ఖాళీ చేయిమని గొడవ చేస్తున్నరు’ అని కలెక్టర్‌‌‌‌ వల్లూరు క్రాంతి ముందు గద్వాల టౌన్‌‌కు చెందిన జయలక్ష్మి అనే దివ్యాంగురాలు గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు రాగా... కలెక్టర్‌‌‌‌ స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి దరఖాస్తు తీసుకున్నారు.  అప్లికేషన్‌‌ పెట్టుకున్న రోజే సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.  న్యాయం చేస్తానని బాధితురాలికి హామీ ఇచ్చారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ..
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర టెంపుల్‌లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  సోమవారం ఉదయం అర్చకులు  యాగశాల ప్రవేశం, గణపతి పూజ, మహాకలశ స్థాపన తదితర పూజలు నిర్వహించారు.  సాయంత్రం ధ్వజారోహణం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.  అనంతరం  అమ్మవారు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వగా.. ఎమ్మెల్యే అబ్రహం,  ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథంతో భక్తులు పెద్ద సంఖ్యలో  హాజరై పూజలు చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,  మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ పాల్గొన్నారు.

ప్రమోషన్స్‌‌ షెడ్యూల్‌‌ విడుదల చేయాలి
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌‌ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: టీచర్ల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌‌ వెంటనే విడుదల చేయాలని  ఎస్టీయూ  రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌‌ డిమాండ్‌‌ చేశారు.  సోమవారం జిల్లా కేంద్రం లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో నిర్వహించిన ఎస్టీయూ వజ్రోత్సవాలకు జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ పద్మావతితో కలిసి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాలు పంచుకున్న ఏకైక టీచర్ల సంఘం ఎస్టీయూనేనని స్పష్టం చేశారు.   ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని,  బడుల పరిరక్షణకు పోరాటం చేసే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో 12 మంది డీఈవోలు, 62 మంది డిప్యూటీ డీఈవోలు, 596 మండలాలకు 33 మంది ఎంఈవోలు మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  16 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.  పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని,  మనఊరు, మనబడి ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తోందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, మాజీ అధ్యక్షుడు భుజంగరావు, డీఈవో గోవిందరాజులు ఉన్నారు.

జోహార్‌‌.. చాకలి ఐలమ్మ
భూమి కోసం.. భుక్తి కోసం... వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మను ఉమ్మడి జిల్లా ప్రజలు యాదిజేసుకున్నారు. సోమవారం ఐలమ్మ జయంతి కావడంతో అధికార యంత్రాంగంతో పాటు పార్టీలు, ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో ఆమె ఫొటోలు, విగ్రహాలకు పూలదండలు వేసి నివాళి అర్పించారు. వనపర్తిలోని ఐలమ్మ విగ్రహానికి మంత్రి నిరంజన్‌‌రెడ్డి పూలమాల వేశారు. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌‌లో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌ రెడ్డి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చాయన్నారు.  
– నెట్‌‌వర్క్, వెలుగు