
- తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17కు మించకూడదని, చెత్తా, తాలు, చెదారం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలని కోరారు.
నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 72 గంటల్లోగా డబ్బులు అందజేస్తామన్నారు. తిప్పర్తి, మిర్యాలగూడలో రెండు ధాన్యం ఆరబెట్టే డ్రయ్యర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రయ్యర్లపై రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ మాట్లాడుతూ.. బుధ, గురువారాల్లో 100 కొత్త కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వం గ్రేడ్-ఏ ధాన్యానికి రూ.2,389, కామన్ వెరైటీకి రూ.2,369 మద్దతు ధరగా నిర్ణయించిందని, సన్న రకాల వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాక అధికారి వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు.
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన
.నల్గొండ అర్బన్, వెలుగు : పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా కపాస్ కిసాన్ యాప్ పై అవేర్‌నెస్ కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఉదయాదిత్యా భవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’ యాప్ పై ట్రైనింగ్ ఇచ్చారు. ‘కపాస్ కిసాన్’ యాప్ స్లాట్ బుకింగ్‌లో సమస్యలు వస్తే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పరిష్కరించాలన్నారు. కౌలు రైతులు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.