ట్రిపుల్ఆర్ పరిహారంలో పారదర్శకత ఉండాలి : కలెక్టర్ క్రాంతి

ట్రిపుల్ఆర్ పరిహారంలో పారదర్శకత ఉండాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ఆర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత పాటించి, రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ట్రిపుల్​ఆర్ భూసేకరణకు సంబంధించి గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్​ఆర్​భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన అవసరం అన్నారు.సర్వే ప్రక్రియ నుంచి పరిహార చెల్లింపుల వరకు ప్రతీ దశలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయలన్నారు. భూములను అందించిన  రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

రైతుల్లో అభిప్రాయ బేధాలు

కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి రైతుల్లో అభిప్రాయ బేధాలు ఉన్నట్టు వివిధ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు కలెక్టర్ కు వివరించారు. భూసర్వేలో సాంకేతిక సమస్యలు, స్థానికంగా అవగాహన లోపాలు వంటి అంశాలు ముందుకొస్తున్నట్టు తెలియజేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రజల్లో అవగాహన కల్పించి పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. సమావేశంలో  రీజినల్ అధికారి శివశంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, ఉమ్మడి జిల్లా అడిషనల్​కలెక్టర్లు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.