
ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. గురువారం ఐటీడీఏ పీవో అంకిత్, డీఎఫ్‌వో ప్రదీప్ కుమార్ శెట్టి, అన్ని శాఖల ఆఫీసర్లు, మండల అధికారులతో కలిసి కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా ఆఫీసర్లు అవగాహన కల్పించాలన్నారు. బూస్టర్ డోస్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా‘ఫ్రై డే డ్రై డే’ ప్రోగ్రాంను నిర్వహించాలన్నారు. పోడు భూముల అప్లికేషన్లను సమర్పించాలన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ భూముల విషయంలో ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించవద్దన్నారు. నేషనల్ పంచాయత్ అవార్డు కోసం ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసి, నామినేషన్లు వేయాలన్నారు. 18 ఏండ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలన్నారు.
అవార్డులకు గ్రామాలను ఎంపిక చేయాలి..
పర్వతగిరి, వెలుగు: నేషనల్ పంచాయత్ అవార్డులకు వరంగల్ జిల్లాలోని బెస్ట్ గ్రామాలను ఎంపిక చేయాలని ఆఫీసర్లను కలెక్టర్ గోపి ఆదేశించారు. కేంద్రం సూచించిన 9 అంశాలను పరిశీలించి, ఆన్ లైన్లో నామినేషన్లు వేయాలన్నారు. జిల్లా నుంచి బెస్ట్ పంచాయతీలుగా పెద్ద మొత్తంలో ఎంపికయ్యేందుకు కృషి చేయాలన్నారు.
సమస్యలుంటే నేరుగా చెప్పండి:ఎంజేపీ స్కూల్ ను సందర్శించిన ఎమ్మెల్యే
మొగుళ్లపల్లి, వెలుగు: స్కూల్లో ఎలాంటి సమస్యలున్నా తనకు నేరుగా ఫోన్ చేసి చెప్పాలని, స్టూడెంట్లు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. మొగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పిల్లలు నీటి కోసం ఆందోళన చేసిన విషయాన్ని తెలుసుకుని, గురువారం స్కూల్ ను సందర్శించారు. మిషన్ భగీరథ ఆఫీసర్లతో నీటి సమస్యపై చర్చించారు. స్కూల్ లో సౌకర్యాలపై ప్రిన్సిపల్ తో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పిల్లలకు తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి, సమస్యలుంటే తెలియజేయాలని ధైర్యం చెప్పారు. అనంతరం టేకుమట్ల మండలంలో పర్యటించి ఆసరా కార్డులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, స్కూల్ ను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణరావు సైతం సందర్శించారు. పిల్లల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
సర్పంచ్, సెక్రటరీ వేధింపులే కారణం!
హసన్ పర్తి, వెలుగు: గ్రామ సర్పంచ్, ఆమె భర్త, పంచాయతీ సెక్రటరీ ముగ్గురు కలిసి తనను వేధిస్తున్నారని ఫీల్ట్ అసిస్టెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతారంలో జరిగింది. ఇటీవల ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్న నేపథ్యంలో శ్యాంసుందర్ రెడ్డి డ్యూటీలో చేరాడు. కాగా, తనను డ్యూటీ చేయకుండా సర్పంచ్ అమితా జీవన్ రెడ్డి, సెక్రటరీ కల్పన అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఓ లేఖ రాసి, గురువారం పాయిజన్ తాగాడు. కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సెక్రటరీ కల్పన స్పందింస్తూ.. తాను డ్యూటీ చేయకుండా అడ్డుకోలేదని, సర్పంచే ఆయనకు విధులు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
టీచర్ల సేవలు వెలకట్టలేనివి
రాయపర్తి, వెలుగు: స్టూడెంట్ల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న టీచర్ల సేవలు వెలకట్టలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్‌రోడ్ లో ఓ ఫంక్షన్ హాల్లో ఎతికల్ కెరీర్ గైడెన్స్ నిర్వహించగా.. చీఫ్ గెస్టులుగా వారు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ టీచర్లను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్టూడెంట్లు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. సమాజంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ తదితరులున్నారు.
ఏజెన్సీలో హైఅలర్ట్
కొత్తగూడ, వెలుగు: మావోయిస్టు దళాలు ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణకు వచ్చాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గూడూరు తదితర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు భారీగా మోహరించాయి. ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పోలీసులు మావోయిస్టుల వాల్ పోస్టర్లు అతికించి, రివార్డులు ప్రకటిస్తున్నారు. గురువారం ఉదయం కొత్తగూడ మండలం పెద్ద ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు బోయిని ఐలయ్యను అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు.
పోలీస్ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన
హనుమకొండ సిటీ, వెలుగు: ఎస్సై, పోలీస్కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఉల్లంఘించిన రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హనుమకొండ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జామ్స్ లో పెట్టిన కామన్ కటాఫ్ మార్కులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. ఫలితాలు రాకముందే సవరించి సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో పాత విధానాన్నే అమలు చేయాలన్నారు. లేదంటే ఈ నెల 13న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తామన్నారు.