ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

లక్సెట్టిపేట, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేశామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, సీజనల్​వ్యాధులకు సంబంధించి అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

 బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని, జ్యోతిబాపూలే స్కూళ్లను సందర్శించారు. క్లాస్​రూమ్​లు, మెస్, కిచెన్, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచి నాణ్యమైన పోషకాహారం అందించాలన్నారు. స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్రీట్​మెంట్ ​తీసుకుంటున్న విద్యార్థిణుల ఆరోగ్యంపై ఆరా

నస్పూర్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆస్పత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థినులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. జ్వరాలతో బాధపడుతున్న స్టూడెంట్లు బి.తరుణి, బి.రేవతిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వీరితోపాటు మరి కొంత మంది వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు.

 కొంత మంది ఉద్దేశపూర్వకంగా కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలని కోరారు. అవాస్తవ, అనాలోచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి జనార్ధన్, సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవో  శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.