
మంచిర్యాల, వెలుగు: విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలం బాబానగర్ ఆశ్రమ బాలుర హైస్కూల్, హాస్టల్, ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, క్లాస్ రూమ్స్, కిచెన్ షెడ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారం అందించాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. టీచర్లు సమయపాలన పాటించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గడ్ పూర్ పల్లె దవాఖానాను సందర్శించి మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలన్నారు. చిన్న గోపాలపూర్ స్కూల్ ను సందర్శించారు.
అనంతరం ర్యాలీలోని ఎస్సీ కాలనీలో జ్వరాల బారిన పడిన 10 మంది నివాస ప్రాంతాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. గుడిపేటలో చేపట్టిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి, స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వేలాల స్టాక్ యార్డ్ నుంచి ఇసుక తరలించేందుకు గ్రీన్ సిగ్నల్
నస్పూర్, వెలుగు: జైపూర్ మండలం వేలాల స్టాక్ యార్డ్ లో ఉన్న ఇసుకను టీజీఎండీసీ సాండ్ బజార్ కు తరలించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వేలాల స్టాక్ యార్డులో ఉన్న 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను టీజీఎండీసీ సాండ్ బజార్‌కు కేటాయించేందుకు సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించామన్నారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఇసుక బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, వర్షం కారణంగా జిల్లాలో ఇసుక సేకరణలో అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం వేలాల స్టాక్ యార్డులో అందుబాటులో ఉన్న సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కేటాయించి రవాణా చేసేందుకు అనుమతించినట్లు పేర్కొ న్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.