
నస్పూర్/ కోటపల్లి, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతితో కలిసి అధికా రులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఆపరేటర్లతో రివ్యూ నిర్వహించారు. గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రైమరీ స్కూళ్ల భవనాలకు రిపేర్లు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే తాగునీరు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి ఒక్క రోజు అక్కడ నిద్రించాలని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఇందిరమ్మ నిర్మాణాలు త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేలా సాంకేతిక పరిజ్ఞానంపై ఉచిత శిక్షణ అందించాలని సూచించారు.
చదువులో రాణించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. కోటపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ హైస్కూల్తోపాటు కేజీబీవీని సందర్శించారు. విద్యార్థుల చదువు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించి తల్లిదండ్రులు, స్కూల్కు పేరు తీసుకురావాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు