
జైపూర్(భీమారం), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా భీమారం మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం సందర్శించారు. మండల కేంద్రంతోపాటు దాంపూర్లో నిర్వహించిన సదస్సులో భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో దరకాస్తులు సమర్పించాలని, రశీదు తీసుకోవాలని సూచించారు. భీమారంలో 163, దాంపూర్లో 59 దరకాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ సదానందం,స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తెలిపారు.
ధాన్యం కొనుగోలు సెంటర్ల తనిఖీ
భీమారం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని, అంశాలను ఏకాగ్రతతో నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. దాంపూర్తో పాటు, జైపూర్ మండలంలోని షెట్ పల్లి, గంగిపల్లి, ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.
సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. ధాన్యం అమ్మేందుకు సెంటర్లకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సంబంధిత రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్లో నమోదు చేసి రైతుల ఖాతాల్లో త్వరగా నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.