
బెల్లంపల్లి రూరల్/నస్పూర్, వెలుగు: రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని పలు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు, చెరువులు కుంటల వద్ద వరద పరిస్థితులను పరిశీలించారు.
తాండూర్ మండల కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద పరిస్థితిని పరిశీలించి ప్రజలు అటువైపుగా రాకుండా పోలీస్, రెవెన్యూ, గ్రామపంచాయతీ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించి వెంటనే బారికేడ్లు పెట్టించారు. కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలోకి చేరిన పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ పరిస్థితిని పరిశీలించి ప్రమాద స్థాయిలో ఉన్న ఇండ్ల ప్రజలను పునరావాసంలో భాగంగా ప్రభుత్వ స్కూల్‌కు తరలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా బ్లీచింగ్, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ లోని ఎర్రవాగులోని బ్యాక్ వాటర్ స్థితిని పరిశీలించి, 3 ఇండ్ల ప్రజలను ప్రభుత్వ స్కూల్‌కు తరలించి పునరావస చర్యలు చేపట్టారు. భీమిని మండలంలోని ఖర్జీభీంపూర్ లో దెబ్బతిన్న రోడ్డు, వంతెనను పరిశీలించి వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్మనోజ్, ఎంపీడీఓలు శ్రీనివాస్‌రెడ్డి, గంగామోహన్, తహసీల్దార్ శ్రావణ్ ఉన్నారు.
నేడు స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 14న జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న స్కూళ్లకు సెలవు ఇవ్వాలని, నిబంధ నలు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.