భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో అధికారులు : కలెక్టర్ కుమార్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో అధికారులు :  కలెక్టర్ కుమార్
  • వాగులు, కల్వర్టులను పరిశీలించిన కలెక్టర్ 

కోల్​బెల్ట్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉంటుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్​అన్నారు. మందమర్రి మండలం అందుగులపేట శివారులోని రాళ్లవాగు, కల్వర్టుల ప్రాంతాలను తహసీల్దార్​ సతీశ్​తో కలిసి కలెక్టర్​ మంగళ వారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో ప్రజల సహాయార్థం కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. 

అందుగులపేటలో దెబ్బతిన్న కల్వర్టులకు వెంటనే రిపేర్లు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వాగుల్లో వరద ఉధృతిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించాలన్నారు. ఆర్ఐ గణపతి రాథోడ్, కాంగ్రెస్​ లీడర్​కడారి జీవన్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లే కీలకం

నస్పూర్, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సర్వేయర్లకు కలెక్టర్​సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2వ బ్యాచ్ లైసెన్స్​డ్​ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి భూ కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లదే కీలక పాత్ర అన్నారు. భూ భారతిలో అందిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. 

సీలింగ్ భూమిని గుర్తించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని సూచించారు. చట్టంలోని పూర్తి వివరాలు తెలుసుకోవాలని, విధులను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలన్నారు. మొదటి విడతలో ఎంపికైన 162 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లకు శిక్షణ అందించి, ఇప్పుడు 169 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 

చెక్ పోస్ట్ ను ప్రారంభించిన కలెక్టర్, సీపీ

కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలంలోని పారుపల్లి వద్ద ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. చెక్ పోస్ట్​లో పోలీసులతో పాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.

 యూరియా అక్రమ రవాణా చేసేవారిని పట్టుకోలన్నారు. యూరియా, ఎరువులు దుర్విని యోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్సై రాజేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.