
- రఘునాథపాలెం మండలంలో సెంటర్ల తనిఖీ
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం రఘునాథపాలెం మండలంలో ఆయన పర్యటించారు. పాపటపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం తాలు లేకుండా, తేమ శాతం 17కి రాగానే సీరియల్ ప్రకారం కాంటా వేసి లారీల ద్వారా వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ చేయాలన్నారు. తాలు పేరుతో తరుగు తీస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతీ సెంటర్లో బోర్డు ఏర్పాటు చేసి టార్పాలిన్ పట్టాలు, గన్నీ బ్యాగులు ఎన్ని ఉన్నాయో వివరాలు ప్రదర్శించాలని చెప్పారు. ధాన్యం శుభ్రపరిచే జల్లేడ ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా విధులో నిర్లక్ష్యం చేసిన రఘునాథపాలెం ఏపీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో సన్యాసయ్యను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల వ్యవసాయ అధికారి శివకుమార్ ఉన్నారు.
సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
ఖమ్మం కార్పొరేషన్ : వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 4న జరిగే నీట్ యూజీ పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు 2,739 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వారి కోసం ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు https://neet.nta.nic.in పోర్టల్ నుంచి నీట్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, నీట్ పరీక్ష జిల్లా నోడల్ అధికారి నరేంద్ర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.