రెసిడెన్షియల్ స్కూల్లో నాణ్యత లేని పప్పును మార్చాలి : కలెక్టర్ హనుమంత రావు

రెసిడెన్షియల్ స్కూల్లో నాణ్యత లేని పప్పును మార్చాలి :  కలెక్టర్ హనుమంత రావు

యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : రెసిడెన్షియల్ ​స్కూల్​లో నాణ్యత లేని పప్పును వెంటనే మార్చాలని కలెక్టర్​ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆలేరులో ఎస్సీ రెసిడెన్షియల్​ కాలేజీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా కిచెన్​లోకి వెళ్లి వంట సరుకులు పరిశీలించారు. 

పప్పు నాణ్యత లేకపోవడం, కూరగాయలు తాజాగా లేకపోవడాన్ని గమనించారు. వాటిని వెంటనే మార్చాలని ఆదేశించారు. వసతులతోపాటు భోజనం గురించి స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, ప్రహరీ కూలిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే పంచాయతీరాజ్ ఈఈకి ఫోన్ చేసి మరమ్మతులు చేయించాలని చెప్పారు. 

మహిళలకు రక్షణ కల్పించాలి..

పని చేసే చోట మహిళలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.'పోష్​' యాక్ట్​పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో సివిల్స్ రైట్స్ డే సందర్భంగా చట్టాలపై ప్రజలకు అవగాహ కల్పించారు. 

ఎస్సీ కాలనీలో పర్యటించి శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. తర్వాత గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గౌరాయపల్లిలోని పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వెల్ఫేర్​ ఆఫీసర్ నర్సింహారావు, డీఎంహెచ్​వో మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్​వో యశోద, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.