
మానకొండూర్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం మానకొండూర్ పీహెచ్‌సీని సందర్శించారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లేబర్ రూమ్, మెడికల్ స్టోర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు వైద్య పరీక్షలు చేయాలని అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఆస్పత్రి డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మానకొండూరులోని భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, సీహెచ్‌వో రాజునాయక్, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంఈవో మధుసూదన్, భవిత కేంద్రం ఇన్‌స్ట్రక్టర్లు ఉమ, రాంప్రసాద్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్, వెలుగు: డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ మీటింగ్‌కు సీపీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అంతకుముందు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.