
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం రెవిన్యూ శాఖ, విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వాలంటీర్లకు 12 రోజులపాటు నిర్వహించనున్న ఆపదమిత్ర శిక్షణను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదం జరిగే అవకాశాలను ముందస్తుగా గుర్తిస్తే ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చన్నారు. మొదటి దశలో గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లకు విజయవంతంగా శిక్షణను పూర్తి చేశామని, రెండో దశలో డిగ్రీ కాలేజీ, ఎన్‌సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌వో వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, పాల్గొన్నారు.
టీబీ ముక్త్ భారత్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా 108 శాతం క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. గురువారం కేంద్ర ప్రభుత్వ టీబీ విభాగం అధికారులు ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రెండోదశలో సులభంగా టీబీ సోకే అవకాశం ఉండే వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, జిల్లా క్షయ నివారణ అధికారి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.