
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: వృద్ధులైన తల్లిదండ్రులను సంరక్షించడంలో వయోవృద్ధుల ట్రిబ్యునల్ ఇస్తున్న ఉత్తర్వులను వారి వారసులు, పిల్లలు పాటించేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు, అధికారులతో సీపీ గౌష్ ఆలంతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల బాగోగులు చూడడం లేదని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, బలవంతంగా ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు ఇటీవల చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
వృద్ధ తల్లిదండ్రుల కేసులకు సంబంధించి ఆర్డీవో ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్‌లో ప్రతి శనివారం నిర్వహించే విచారణకు ఓ పోలీస్ అధికారిని కేటాయించాలని సీపీకి సూచించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు సీడీపీవో చింతపల్లి శ్రీమతిని కలెక్టర్ సన్మానించారు. ఉద్యోగ విరమణ అనివార్యమని, రిటైర్‌మెంట్ తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, డీడబ్ల్యూవో సరస్వతి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ కృష్ణ ప్రసాద్, వయోవృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, పోరెడ్డి నరేందర్ రెడ్డి, జనార్దన్ రావు, రాధ పాల్గొన్నారు.