
కరీంనగర్ టౌన్, వెలుగు: 15 ఏండ్ల వయస్సు నిండిన బాలికలు, దివ్యాంగ మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి 269 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఫేసియల్ హాజరును టీచర్ల క్యాజువల్ లీవులతో లింక్ చేయాలని సూచించారు. మండలాల్లోని స్పెషల్ ఆఫీసర్లు, గవర్నమెంట్ హాస్టళ్లను సందర్శించి, వసతులు, సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంలో అర్హులంతా లబ్ధి పొందేలా చూడాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టరేట్ ఆడిటోరియం పనులు, సప్తగిరి కాలనీలోని యూపీఎస్ స్కూల్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఈ భవనంలోకి అద్దె బిల్డింగ్‌లో కొనసాగుతున్న సప్తగిరికాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను తరలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజి వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ, డా.సనా, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.