
- విద్యాశాఖ మీటింగ్ లో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఐసీడీఎస్, విద్యాశాఖలో నిర్వహించిన కో ఆర్డినేషన్ మీటింగ్‌లో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ బాట నిర్వహించి 6 –8 ఏండ్ల పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు.
నూతన సిలబస్ ద్వారా ఇస్తున్న ప్రత్యేక బోధన గురించి తల్లిదండ్రులకు తెలియజేసి నమోదును పెంచాలని సూచించారు. అంగన్వాడీలో ప్రీస్కూల్ పూర్తి చేసిన పిల్లలందరి జాబితా ఎంఈవోలకు సమర్పించాలని ఆదేశించారు. ఈ జాబితాలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లల్లో చేరేలా హెచ్ఎం, ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రైవేట్ బిల్డింగ్స్ ల్లో కొనసాగుతున్న అంగన్వాడీ సెంటర్లన్నింటిని ప్రభుత్వ స్కూళ్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని ఆదేశించారు.
ఇప్పటికే మార్చాల్సిన అంగన్వాడి కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలకు కావాల్సిన వసతులు సమకూరుస్తామని వెల్లడించారు. 2015 నుంచి 2023 వరకు టెన్త్ ఫెయిల్ అయి చదువు ఆపేసిన విద్యార్థులందరినీ గుర్తించి, వారు ఈ ఏడాది పాస్ అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు.
ఈ ఏడాది టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులందరూ వచ్చే జూన్ లో నిర్వహించే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ల్లో పాస్ అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీటీడీఓ పవన్ కుమార్, డీడబ్ల్యుఓ సరస్వతి, డీఈఓ జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కోఆర్డినేటర్లు ఎం. శ్రీనివాస్, ఆంజనేయులు, సీడీపీఓ సబితా, తదితరులు పాల్గొన్నారు.