
కరీంనగర్ టౌన్, వెలుగు: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం సిటీలోని జడ్పీ ఆఫీస్‌లో నిర్వహిస్తున్న లైసెన్స్డ్ సర్వేయర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 రోజులపాటు 269 మంది అభ్యర్థులకు సర్వేయర్శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ సందర్భాలలో ప్రభుత్వ అవసరాల సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర కీలకమని గుర్తుచేశారు.
భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సర్వేయర్లు శిక్షణకు క్రమం తప్పకుండా హాజరై అన్ని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని కోరారు. గత రికార్డులను పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సర్వే విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అనంతరం శిక్షణ పొందుతున్న సర్వేయర్లకు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.