
కరీంనగర్ సిటీ, వెలుగు: పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహలో ఉన్న 3 ఏండ్ల పాపను యూఎస్‌కు చెందిన దంపతులకు కలెక్టర్ దత్తత ఇచ్చారు. వీరికి ఇదివరకే బాబు ఉండగా ఆడపిల్లను దతత్త తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. రూల్స్ ప్రకారం విచారించి చిన్నారిని దత్తత ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దత్తత కావాలనుకునేవారు జడ్పీలోని జిల్లా సంక్షేమ అధికారి ఆఫీసులో సంప్రదించాలన్నారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో సర్వాయి చిత్రపటానికి, అల్గునూర్‌లోని సర్వాయి విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు.
ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీడబ్ల్యూవో సరస్వతి, బీసీ వెల్ఫేర్‌ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి గౌడ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, లీడర్లు అంజయ్య, సాగర్ గౌడ్ పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ స్టూడెంట్స్‌కు ప్రశంస
చిగురుమామిడి మండలం ముల్కనూర్ మోడల్ స్కూల్ స్టూడెంట్స్ స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్–-బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ డాల్ ప్రాజెక్టును అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో రూపొందించారు. సోమవారం కలెక్టర్ ఎదుట ఈ ప్రాజెక్టును ప్రదర్శించారు. ప్రాజెక్టును రూపొందించిన వైష్ణవి, అనుశ్రీ, గైడ్ టీచర్లు ఎన్.కొండల్ రెడ్డి, పీజీటీ వి.ముక్తి ప్రసాద్, ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ జయపాల్ రెడ్డిని కలెక్టర్ ప్రశంసించారు.