
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండి, కంప్యూటర్ విద్యపై పట్టు పెంచుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఫొటోషాప్ పై నిర్వహించిన సమ్మర్ క్యాంప్ శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టంగా చదివితే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు.
శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిరోజు కంప్యూటర్‌పై ప్రాక్టీస్ చేయాలన్నారు. అనంతరం విద్యాశాఖ, బాలభవన్ ఆద్వర్యంలో 45 రోజుల పాటు సంగీతం, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, మృదంగం, కర్ర సాము, అబాకస్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, యోగా శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సెక్టోరియల్ఆఫీసర్అశోక్ రెడ్డి, ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ వెంకటరాంబాబు, బాలభవన్ సూపరిండెండెంట్ మంజులా దేవి, తదితరులు పాల్గొన్నారు.