
సంగారెడ్డి టౌన్, వెలుగు: చదువుతోనే మహిళలకు భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వసతి గృహంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరును పరిశీలించిన కలెక్టర్ తరగతుల నిర్వహణ పద్ధతులు, అధ్యాపకుల వివరాలు ఆరా తీశారు.
వసతి గృహంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళా కాలేజీలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో ఉన్నాయా అని ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల సూచించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ అరుణాబాయి, తహసీల్దార్ జయరామ్, వసతి గృహ సంక్షేమ అధికారి కల్పన, సిబ్బంది ఉన్నారు.