
ఝరాసంగం, వెలుగు: ఝరాసంగం మండల పరిధిలో గల జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాంతంలోని చీలెపల్లి తండాను శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ముందుగా అధికారుల వద్ద ఉన్న నిమ్జ్ మ్యాప్‌ను పరిశీలించారు. రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించారు. తండా జనాభా గురించి ఆరా తీయగా 500 ఉంటుందని అధికారులు చెప్పారు. బర్దీపూర్, ఎల్గోయి గ్రామ శివారులో నిమ్జ్ కోసం సేకరించిన భూములను పరిశీలించారు. వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు ఎంత భూమి కేటాయించారని అడిగారు. సమస్యాత్మక భూములను గుర్తించాలని, ఇప్పటికే సేకరించిన భూములకు హద్దురాళ్లు పెట్టాలన్నారు.
బర్దీపూర్ పాఠశాల అకస్మిక తనిఖీ
బర్దీపూర్ గ్రామంలోని ప్రైమరీ, హై స్కూళ్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులు, టీచర్ల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని పెంచేలా టీచర్ల బోధన ఉండాలన్నారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందాయా అని విద్యార్థులను అడిగారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి,ఆర్డీవో రాంరెడ్డి, నిమ్జ్ జోనల్ మేనేజర్ బలరాం రాథోడ్, తహసీల్దార్ తిరుమల్ రావు, ఆర్ఐ రామారావు, సర్వేయర్లు లాల్సింగ్, నర్సింలు పాల్గొన్నారు.