
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మించే రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టర్క్యాంపు ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు మొత్తం 5 ప్యాకేజీలుగా రహదారిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
భూ సకరణ పనుల ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, అందోల్ ఆర్డీవో పాండు, నేషనల్ హైవే అథారిటీ మేనేజర్ శ్రీహరి, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.
నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి
నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ నిమ్జ్ ప్రాజెక్టు ఫేజ్-1 కు సంబంధించి బర్దిపూర్, శీలపల్లి గ్రామాల్లో భూసేకరణ పనులను స్పీడప్ చేయాలన్నారు.
గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి, రైతులకు అందిస్తున్న పరిహారం, ప్యాకేజీల వివరాలు, భవిష్యత్లో జరిగే గ్రామాభివృద్ధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఫేజ్-2 లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, వాటికి సంబంధించిన పరిహార చెల్లింపులు త్వరితగతిన చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి రాం రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.