
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో వరద వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలం ధూప్‌సింగ్ తండా కాజ్వే నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వాగులో వరద ఉధృతి ఉన్నప్పుడు ఎవరినీ ఆ రూట్లో వెళ్లేందుకు అనుమతించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రూ.3 కోట్లతో చేపట్టిన కాజ్వే నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి తండా వాసులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. హవేలీ ఘనపూర్ ఎంపీడీవో ఆఫీస్ లో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ విధానాన్ని జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు రూపొందించిన ఓటర్ల జాబితాను టీ-పోల్ యాప్‌లో నమోదు చేసేందుకు ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అందించారని చెప్పారు.
కొత్తగా ఏర్పడిన ఒక్కో పంచాయతీలో ఆరు వార్డులకు తగ్గకుండా ఓటర్లను విభజించాలని అందులోనూ ఒక కుటుంబం ఒక వార్డులోనే ఉండేలా నమోదు చేయాలని సూచించారు. హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్, ఆన్లైన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సీజన్‌కు జిల్లాలో తగినన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నాయని కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.