జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ శర్మ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు.
పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రిసెప్షన్ ప్రక్రియలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 24, 48, 72 గంటల నివేదికలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ 90306 32608 ప్రత్యేక ఫిర్యాదుల కేంద్రానికి కాల్ చేయాలని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ఫణీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వ్యయ పరిశీలకులు రమేశ్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
