విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి రూరల్, వెలుగు: విద్యార్థులకు ప్రత్యేకంగా హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మండలంలోని అటవీ గ్రామమైన ఆజంనగర్​లో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జడ్పీహై స్కూల్, అంగన్​వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.

 ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. జడ్పీహెచ్​ఎస్​ను తనిఖీ చేసి బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరెంట్ సరఫరా సమస్య ఉన్నదని తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.