అభ్యర్థులు కేసుల వివరాలు ఇవ్వాలి : కలెక్టర్​ రాజర్షి షా

అభ్యర్థులు కేసుల వివరాలు ఇవ్వాలి : కలెక్టర్​ రాజర్షి షా

మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేసేటపుడు ఎన్నికల కమిషన్​ నిబంధనల ప్రకారం తమకున్న స్థిర, చర ఆస్థులు, బ్యాంకు డిపాజిట్లు, నగదు వివరాలతో అఫిడవిట్​ సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షిషా సూచించారు.  గురువారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, మెదక్, నర్సాపూర్​ రిటర్నింగ్​ ఆఫీసర్లు రాజేశ్వర్​, శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు అఫిడవిట్​ ఇవ్వడంతో పాటు, తమపై ఉన్న క్రిమినల్​ కేసుల గురించి న్యూస్​ పేపర్​లు, టీవీల్లో మూడు సార్లు డిక్లరేషన్​ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా మెదక్​, నర్సాపూర్ ఆర్డీఓ ఆఫీస్​ల్లో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నామినేషన్​ దాఖలు చేసేటప్పుడు  అభ్యర్థితో పాటు, నలుగురు మాత్రమే ఆర్​ఓ ఆఫీస్​లోకి అనుమతి ఉంటుందన్నారు. ఆన్​లైన్​లో కూడా నామినేషన్​ దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. రోజు వారి దాఖలైన నామినేషన్ల వివరాలు, అఫిడవిట్​లను డిస్​ప్లే చేస్తామని పేర్కొన్నారు.

నో యువర్​ క్యాండిడేట్​ యాప్​లో నామినేషన్​ వేసిన అభ్యర్థుల పూర్తి వివరాలు అప్​ లోడ్​ చేస్తామని వివరించారు. ఎవరైనా గుగుల్​  ప్లేస్టోర్​ నుంచి ఈ యాప్​ డౌన్​ లోడ్​ చేసుకుని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గురించి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. నామినేషన్​ల ప్రక్రియ సందర్భంగా మెదక్​, నర్సాపూర్​ లోని ఆర్​ఓ ఆఫీస్​ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. 

వరి ధాన్యం కొనుగోలు సమస్యల కోసం కంట్రోల్​ రూమ్​

జిల్లా  వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన  కంట్రోల్ రూమ్​ను రైతులు వినియోగించుకోవాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. ఏవైనా సమస్యలుంటే రైతులు 9281103685 నెంబర్​కు కాల్​ చేయవచ్చన్నారు.  ప్రతి రోజు ఉదయం. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో  జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, సివిల్​ సప్లయీస్​ మేనేజర్​ హరిక్రిష్ణ, సిబ్బంది సాదిక్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు. 

ALSO READ : ఐటీ రెయిడ్స్​తో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి