సమస్యలు త్వరగా పరిష్కరించాలి : రాజర్షి షా

సమస్యలు త్వరగా పరిష్కరించాలి : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  ప్రజావాణిలో వచ్చే ఆర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్​ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం ఆయన మెదక్​ కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో కలిసి ఆర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రజలకు అధికారులు న్యాయం చేస్తారనే నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలకోర్చి వస్తుంటారని దీనిని దృష్టిలో పెట్టుకొని సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సిద్దిపేటలో..

సిద్దిపేట టౌన్ :  ప్రజావాణిలో భాగంగా వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ప్రశాంత్​ జే పాటిల్​అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సిద్దిపేట కలెక్టరేట్ లో ఆర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని  ఏర్పాటు చేశారన్నారు.

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇక్కడకు వస్తారని వారి సమస్యలు పరిష్కరించడం మన కర్తవ్యం అని సూచించారు. అనంతరం ముదిరాజ్​లను బీసీ ఏ లోకి చేర్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించారు.

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని గ్రామస్తులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పట్టాలు ఇప్పించాలని అధికారులు విన్నవించారు. ప్రజావాణిలో మొత్తం వివిధ సమస్యలపై  26 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి , డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 
సంగారెడ్డిలో ..

సంగారెడ్డి టౌన్ :  ప్రజావాణి  ఫిర్యాదులను అధికారులు  సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో అడిషనల్ కలెక్టర్​ మాధురితో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా  ఆత్నూర మండలం కోనంపేట గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని గ్రామానికి చెందిన నర్సింలు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

గుమ్మడిదల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త పేరిట ఉన్న ఐదు ఎకరాల భూమిని తన పేరు పైకి మార్చాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది. పలువురు భూ సంబంధిత సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఉద్యోగం చూపాలని, ట్రై సైకిల్స్ ,వికలాంగుల పింఛన్​ అందజేయాలని కోరుతూ ఆర్జీలను అందజేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు . ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.  మొత్తం 27 దరఖాస్తుల్లో 9 రెవెన్యూ శాఖకు, 18 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీఆర్​ఓ నగేశ్, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

పింఛన్​ కోసం తిరుగుతున్నా ఇస్తలేరు 

నా భర్త, కుమారుడు మరణించారు. నాకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాను. పింఛన్​ కోసం కొద్ది నెలలుగా నర్సాపూర్​లోని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఇయ్యాల్ల కలెక్టర్​ సార్​ను కలిసి బాధ చెప్పుకునేందుకు వచ్చా. 
- కొట్టాల తులసమ్మ, నర్సాపూర్​

డెబ్బై ఏళ్లున్నా పింఛన్​ ఇస్తలేరు

నాకు డెబ్బై ఏళ్లు. గతంలో ఉన్న కేసీఆర్​ సర్కార్  పింఛన్​ ఇస్తదేమోనని అనుకున్న ఇయ్య్యలే. పింఛన్​ ఇప్పియ్యమని ఊర్ల పంచాయతీ సెక్రెటరీ సాబ్​ నుంచి అందరినీ వేడుకున్నా ఎవ్వరూ పట్టించుకోలె. కలెక్టర్​ఆఫీసుకు మూడు సార్లు వచ్చి దరఖాస్తు చేసుకున్నా అయినా ఇయ్యలేదు. ఇయ్యాల మరో సారి దరఖాస్తు పెట్టుకున్నా.  

మద్యూరి లచ్చమ్మ, చండూరు, చిలప్​చెడ్​ మండలం

ఈ-శ్రమ్​ కార్డు సాయం రాలేదు 

మాది చేగుంట మండలం పొలంపల్లి. నా భార్య ఎల్లమ్మకు ఈ శ్రమ్​కార్డు ఉంది. ఆమె చనిపోయి పదకొండు నెలలవుతున్నా బీమా డబ్బులు రూ. 5 లక్షలు  రాలేదు. వీటికోసం హైదరాబాద్​లో ఉండే ఆఫీసుకు కూడా పోయినం కానీ మెదక్​ కార్మిక శాఖ ఆఫీసులోనే ఇంకా ఎంట్రీ చేయలేదని చెప్పారు. ఇయ్యాల్ల ప్రజావాణి ఉంది కలెక్టర్​ సార్​కు చెబితే న్యాయం జరుగుతుందని వచ్చా. 

- మ్యారబోయిన శ్రీశైలం, పొలంపల్లి, చేగుంట మండలం