మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్ రాజర్షి షా

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా  బుధవారం సొనాల మండలంలోని కోటా‘కె’ గ్రామంలో మహిళా సహాయక సంఘం ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

 మహిళల ఆర్థిక స్వావలంబ నను పెంపొందించేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించినట్టు పేర్కొన్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. కార్యక్రమంలో డీఆర్​డీఓ రవీందర్, ఏపీఎం తదతరులు పాల్గొన్నారు.

ఎస్​బీఐ సేవలు అభినందనీయం

జిల్లాలో ఎస్​బీఐ  చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్​అన్నారు. ఆదిలాబాద్​పట్టణంలోని బంగారుగూడ ప్రైమరీ స్కూల్​లో ఎస్​బీఐ, నిర్మాణ్​ ఫౌండేషన్​ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్​ హాజరయ్యారు. స్కూల్​కు ఎస్​బీఐ అందజేసిన వాటర్​ ప్యూరిఫయర్, 5 అల్మారాలు, 155 స్కూల్ బ్యాగులు ,155 జతల స్కూల్ షూస్, రెండు కంప్యూటర్లు, ఒక మైక్ సెట్, స్కూల్ ​కిట్స్​ను కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్​ ఆర్​ఎం రామచంద్రరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, మేనజర్​బాలకృష్ణ, హెచ్​ఎం గంగాదేవి, టీచర్లు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని  పరిరక్షించాలి

బజార్ హత్నూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని  పరిరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వన మహోత్సవంలో భాగంగా డీఆర్​డీవో ఆధ్వర్యంలో బజార్ హత్నూర్ మండలం పరిధిలోని గిర్నూర్ శివారు చెరువు కాలువపై  అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని  కాపాడుకోవాలన్నారు. పీడీ రవీందర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఇన్​చార్జి ఎక్సైజ్ ఎస్సై మురళీకృష్ణ, తహసీల్దార్ శ్యాంసుందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.