
కోనరావుపేట/చందుర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లలో కటింగ్‌లు పెట్టొద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైస్ మిల్లర్లను ఆదేశించారు. శనివారం చందుర్తి మండల కేంద్రం, మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనరావుపేట మండలం బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వడ్ల కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు.
కాంట్రాక్టర్లు ప్రతి సెంటర్‌కు లారీలను సకాలంలో ఏర్పాటు చేయాలని, లారీల సరఫరా ఆలస్యమై, వడ్లు తడిస్తే కాంట్రాక్టర్‌కు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన వడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాలిసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఈ నెల 13 న నిర్వహించనున్న పాలిసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో ఎగ్జామ్ నిర్వహణపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిసెట్‌కు జిల్లాలో 7 సెంటర్లు ఏర్పాటు చేశామని, వీటిల్లో 2136 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి పాల్గొన్నారు.