
గద్వాల, వెలుగు: రైతులు ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కీములు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, రుణాల గురించి అవేర్నెస్ కల్పించాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో వ్యవసాయ మౌలిక సదుపాయాలు రుణాలు, ఆయిల్ పామ్ సాగు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు కీలకమన్నారు. వాటిని ప్రతి రైతుకు చేర్చేందుకు ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలన్నారు.
చిన్న తనహా ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా పెట్టుబడి పై 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, రుణాలపై సబ్సిడీలు, ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ రిలీజ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియ నాయక్, శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, ఉద్యన ఆఫీసర్ అక్బర్, నాబార్డ్ ఆఫీసర్లు మనోహర్ రెడ్డి, భుజంగారావు, వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ ఆఫీసర్ షకీలా బాను పాల్గొన్నారు.