
- కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల టౌన్/కోరుట్ల, వెలుగు: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జగిత్యాలలోని చింతకుంటచెరువు, కోరుట్లలోని అంబేద్కర్ కాలనీలోని పెద్దవాగు, మెట్‌పల్లిలోని వట్టి వాగు వద్ద నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జన ప్రాంతాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేయాలని అవసరమైన చోట క్రేన్లు, తెప్పలను సిద్ధంగా ఉంచాలన్నారు.
నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, హైమాస్ట్ లైటింగ్, తాగునీరు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, డీఎస్పీ రఘుచందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.