ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ శరత్

ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్ , వెలుగు : ఎన్నికల విధుల పట్ల అవగాహన ఉన్నప్పుడే  ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్​లో మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.  

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్​ఓ నగేశ్,  మాస్టర్ ట్రైనర్ క్రిష్ణ కుమార్, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.

 గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సీజ్ చేసిన నగదు విడుదలకు గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శరత్  తెలిపారు. నోడల్ అధికారిగా డీసీఓ తుమ్మ ప్రసాద్, సభ్యులుగా డీటీఓ కవిత, డీఆర్‌‌డీఓ శ్రీనివాసరావు ను నియమించినట్లు పేర్కొన్నారు.  సీజ్ చేసిన నగదుకు సంబంధించి సదరు వ్యక్తులు పూర్తి ఆధారాలను గ్రీవెన్స్ కమిటీలో సమర్పిస్తే నగదును తిరిగి అందిస్తామని తెలిపారు.  జిల్లా గ్రీవెన్స్ కమిటీ అధికారులను  సంప్రదించడానికి 9100115691/9281487272/7799934135 నెంబర్లకు ఫోన్​ చేయవచ్చని సూచించారు.

ఓటు హక్కుపై అవేర్నెస్​ పెంచాలి

ఓటుహక్కుపై అవేర్నెస్​ పెంచాలని కలెక్టర్​ శరత్​అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్వీప్ యాక్షన్ ప్లాన్ పై సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, అన్ని పరిశ్రమల్లో ఓటర్ అవేర్నెస్ ఫోరాలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు, రైతులు, థర్డ్ జెండర్, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కు ఓటు హక్కు వినియోగించు కోవడం, ఈవీఎం పై ఓటు వేయడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని తెలిపారు. 

ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం..

వరి పండే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్​లో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి చిన్న ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు.

గ్రేడ్ -ఎ రకం  ధాన్యం ధర క్వింటాలుకు రూ.2203/- , సాధారణ రకం ధాన్యంకు రూ.2183/- లభిస్తాయని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ మాధురి, సివిల్ సప్లయీస్​ డీఎం సుగుణ బాయ్, డీఎస్​ఓ వనజాత, డీఆర్‌‌డీఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, డీసీఓ ప్రసాద్, ఏఈవోలు, రవాణా కాంట్రాక్టర్లు,కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు  పాల్గొన్నారు.

ఓటు ఒక బ్రహ్మస్త్రం

మెదక్ టౌన్:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. మండలంలోనిని రాజ్​పల్లి, మెదక్​ పట్టణంలోని దాయర వీధుల్లో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ రాజర్షి షా మాట్లాడుతూ.. ఓటు ఒక  బ్రహ్మాస్త్రం  దేశాన్ని ప్రభావితం చేసే శక్తి అన్నారు. ఓటు హక్కు కలిగిన యువతీ యువకులు ఓటింగ్​ రోజున సెలవు దినం అనుకోకుండా భవిష్యత్​ను నిర్ణయించే రోజుగా భావించాలన్నారు.

ఎవరైనా ఓటు నమోదు చేసుకోనట్లయితే 31వ తేదీ  వరకు అవకాశం ఉందన్నారు. నవంబరు 10 నుంచి 25 వరకు ఓటర్లకు స్లిప్ప్పులు పంచుతామన్నారు."నేను  ఖచ్చితంగా ఓటు వేస్తాను "అనే  నినాదం తో ప్రజలందరూ ఓటింగ్​లో  భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు.   ఎస్పీ  రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఓటు కోసం ఎవరైనా ప్రలోబాలకు గురిచేస్తే  సీ- విజిల్​ యాప్​లో ఫిర్యాదు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్​ టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి కాల్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో  మెప్మా పీడీ ఇందిర, మెదక్​ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.